సేవాలాల్‌ బాటలో నడవాలి

సంత్‌శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం చుంచుపల్లి మండలంలోని నందతండ గ్రామ పంచాయతీలో నియోజకవర్గ స్థాయి సేవాలాల్‌ 281వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గురువు దుర్గ మహరాజ్‌  భోగ్‌బండారో నిర్వహించారు. సేవాలాల్‌ చిత్రపటానికి వనమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీతికి నిజాయితికి మారుపేరు బంజారా జాతి అని, వారు ఎన్నో ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంజారా జాతి పక్షపాతి అని పేర్కొన్నారు. 


లంబాడీలకు ఆరాధ్యదైవమైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారని, సేవాలాల్‌ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా నిధులను కేటాయించారని తెలిపారు బంజారాల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులోఉంటానని చెప్పారు.  తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, వాటిని అభివృద్ధి బాటలో నడిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో యువకులు, మహిళలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం గురువు దుర్గమహరాజ్‌ శాంతి సందే శం ఇస్తూ లంబాడీలకు సేవాలాల్‌ మహరాజ్‌ ఆరాధ్యదైవమన్నారు. లంబాడీల జీవన శైలి, చరిత్ర, సేవాలాల్‌ చేసిన సేవలను, త్యాగాలను గురించి వివరించారు.  మహనీయుడైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. అలాగే ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 15న సెలవుదినంగా ప్రకటించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం కమిటీ సభ్యులు వనమాను సత్కరించారు.