వలసలను నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పందించారు. అమెరికాలో ఉన్న కంపెనీల కన్నా భారతీయ ఐటీ కంపెనీలే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని, ఒకవేళ అమెరికా వలసల్ని ఆపేస్తే, అప్పుడు ఆ దేశ ప్రగతి నిలిచిపోతుందని కాంత్ తెలిపారు. ఇమ్మిగ్రేషన్ విధానం వల్లనే అమెరికా అభివృద్ధి చెందిందన్నారు. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన అన్నారు. భారత్‌తో పోలిస్తే యూరోప్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే మన దగ్గర కేసులు తక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. టెస్టింగ్ ప్రక్రియను విస్తృత పరిచినట్లు వెల్లడించారు. రోజుకు 5వేల నుంచి 30 వేల వరకు పెంచామన్నారు. 130 కోట్ల జనాభాను టెస్ట్ చేయడం కుదరదన్నారు.
భారత ఎఫ్‌డీఐ సవరణలపై స్పందిస్తూ, చైనాకు మన కొత్త విధానంతో ఎటువంటి సంబంధం లేదన్నారు. చైనా పెట్టుబడులను అడ్డుకుంటున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో మన ఆస్తులను మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోవిడ19ను నియంత్రించిన అంశాన్ని బట్టి మన ప్రగతి రేటు ఉంటుందన్నారు. ఒకవేళ రెండోసారి కరోనా విజృంభిస్తే అప్పుడు మన పరిస్థితి అదుపు తప్పుదుందన్నారు.